ALL INDIA TEACHERS PORTAL
BREAKING NEWS
Teacher recruitment notifications, GOs, transfers and latest education updates from across India

తెలంగాణ ఇంజినీరింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌: బకాయిల చెల్లింపుపై హైకోర్టు సీరియస్



రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద చెల్లించాల్సిన బకాయిలపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ బకాయిలను ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పలు కళాశాలలు దాఖలు చేసిన పిటిషన్లపై జూన్ 24న జస్టిస్ జువ్వాడి శ్రీదేవి విచారణ జరిపారు.

బకాయిలు కోట్ల రూపాయల్లో పెండింగ్‌లో ఉంటే కళాశాలల నిర్వహణ ఎలా సాధ్యమవుతుందని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఒకవైపు ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా, మరోవైపు విద్యార్థుల నుంచి వసూలు చేయవద్దంటే ప్రస్తుత అడ్మిషన్లు ఎలా ఇస్తారని నిలదీసింది.

ప్రభుత్వం రకరకాల జీవోలు జారీ చేస్తోందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను నేరుగా విద్యార్థుల ఖాతాల్లోనే జమ చేస్తామని చెబుతోందని కళాశాలల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

రీయింబర్స్‌మెంట్‌లో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదించారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ముందుగా తన వాటాను చెల్లించిన తర్వాతే తమ వాటాను విడుదల చేస్తామని కేంద్రం షరతు పెడుతోందని, దీంతో మొత్తం బకాయిల భారం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడుతోందని వివరించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి రెండు వారాల గడువు కావాలని ఆయన కోరారు.

ప్రభుత్వం కోరిన రెండు వారాల గడువును ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించారు. బకాయిల చెల్లింపుపై ఒక నిర్దిష్టమైన తేదీని చెప్పాలని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను జూన్ 25కి (నేటికి) వాయిదా వేశారు.

Share this article

Post a Comment

0 Comments